Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, April 23, 2013

ప్రకటన 1వ అధ్యాయము



1 యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.
2 అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను.
3  సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.
4 యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,
5 నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.
7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌.
8  అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
9 మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.
10 ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము
11 నీవు చూచు చున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.  
12 ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.
13 తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.
14 ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;
15 ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్నఅపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
16 ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనియుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.
17 నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;
18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.
19 కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని,
20 అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు. 
     Download Audio File

ప్రకటన 2వ అధ్యాయము



1  ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా
2  నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికు
3  నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.
4  అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.
5  నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.
6  అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేనుకూడ వీటిని ద్వేషించుచున్నాను.
7  చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షఫలములు భుజింప నిత్తును.
8  స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుముమొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా 
9  నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నే నెరుగు
10  ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను.
 11  సంఘములతో ఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.జయిం చువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.
12  పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా
 13  సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్య్ను చంపబడిన దినములలో నీవు నా నామము విసర్జింపలేడని నేనెరుగుదును.
14  అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకు నకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలో ఉన్నారు.  
15  అటువలెనే నీకొలాయితుల బోధ ననుసరించు వారును నీలో ఉన్నారు.
 16  కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.
17  సంఘ ములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
18  తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాద ములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా
19  నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.
20  అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
21  మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.
22  ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని క్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును,
23  దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.
24  అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగ తులను ఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని వ
25  నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టు కొనుడి.
26  నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను.
27  అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;
28  మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.
29  సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
           Download Audio File

ప్రకటన 3వ అధ్యాయము



1  సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలునుగలవాడు చెప్పు సంగతులేవనగా - నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే
2  నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.
3  నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.
4  అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.
5  జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.
6  సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక.
7  ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము
దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతు లేవనగా
8  నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు
9  యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.
10  నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను.
11  నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
12  జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను
13  సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
14  లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఆమేన్‌ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా
15  నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
16  నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.
17  నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
18  నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
19  నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
20  ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడు ను భోజనము చేయుదుము.
21  నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.
22  సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.
         Download Audio File

ప్రకటన 4వ అధ్యాయము



1  ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇకమీదట జరుగవలసినవాటిని నీకు కనుపరచెదననెను
2  వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను,
3  ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతమువలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను.
4  సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
5  ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.
6  మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను.
7  మొదటి జీవి సింహమువంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖముగలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజువంటిది.
8  ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి-భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.
9  ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలు గునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా
10  ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడైయుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు
11  ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. 
     Download Audio File

ప్రకటన 5వ అధ్యాయము



1 మరియు లోపటను వెలుపటను వ్రాతకలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహా సనమునందు ఆసీసుడైయుండువాని కుడిచేత చూచితిని.
2 మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన యొక దేవదూత బిగ్గ రగా ప్రచురింపగా చూచితిని.
3 అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.
4 ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
5 ఆ పెద్దలలో ఒకడుఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
6 మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
7 ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండువాని కుడిచేతిలో నుండి ఆ గ్రంథమును తీసికొనెను.
8 ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
9 ఆ పెద్దలునీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,
10 మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూ10 లోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.
11 మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.
12 వారువధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
13 అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు    ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. 
14 ఆ నాలుగు జీవులు ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.
       Download Audio File

ప్రకటన 6వ అధ్యాయము



1 ఆ గొఱ్ఱెపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.
2 మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.
3 ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని
4 అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మియ్యబడెను.   
5 ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు - రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.
6 మరియు - దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.
7 ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు - రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.
8 అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను మరణమువలనను భూమిలోనుండు క్రూర మృగములవలనను భూనివాసులను చంపుటకు భూమియొక్క నాలుగవ భాగముపైన అధికారము వానికియ్యబడెను 
9 ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.
10 వారు -  నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
11 తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్యబడెను; మరియు--వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
12 ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
13 పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.
14 మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.
15 భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
16 బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైయున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
17 మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు
    Download Audio File

ప్రకటన 7వ అధ్యాయము


1  అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్క నాలుగు  దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని 
2  మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో
3  ఈ దూత - మేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
4  మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.
5  యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,
 6  ఆషేరు గోత్రములో పండ్రెండు వేలమంది, నఫ్తాలి గోత్రములో పండ్రెండు వేలమంది, మనష్షే గోత్రములో పండ్రెండు వేలమంది,
 7  షిమ్యోను గోత్రములో పండ్రెండు వేలమంది, లేవి గోత్రములో పండ్రెండు వేలమంది, ఇశ్శాఖారు గోత్రములో పండ్రెండు వేలమంది,
 8  జెబూలూను గోత్రములో పండ్రెండు వేలమంది, యోసేపు గోత్రములో పండ్రెండు వేలమంది, బెన్యామీను గోత్రములో పండ్రెండు వేలమంది ముద్రింపబడిరి.
 9  అటు తరువాత నేను చూడగా, ఇదిగో,  ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రకులు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి 
10  సింహాసనా సీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
11  దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడిఆమేన్‌;
12  యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌.
13  పెద్దలలో ఒకడు - తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను.
14  అందుకు నేను - అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను - వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
15  అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్లు ఆయన ఆలయ ములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారిమీద కప్పును;
16  వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు,
17  ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.
    Download Audio File